చాలా మంది బొద్దింకలన్నా, బల్లులన్నా విపరీతంగా భయపడుతుంటారు. ఈ భయం ఫోబియాకు సంబధించింది. ఈ ఫోబియాతో మునుముందు వచ్చిపడే విపరీత పరిణామాలేమీ లేకపోయినా, కుటుంబ వాతావరణం మాత్రం దెబ్బ తింటుంది జన్యుమూలాలే ప్రధాన కారణంగా వచ్చే ఈ ఫోబియాను మందులూ, కౌన్సెలింగ్ ద్వారా పూర్తిగా త గ్గించడం సా«ధ్యమేనంటున్నారు నిపుణులు....
నా పెళ్లయి నాలుగేళ్లు. మాకు ఒక బాబు, ఒక పాప. నా భార్య బిఎస్‌సి దాకా చదువుకుంది. ఆమె హౌస్‌వైఫ్‌గానే ఉంటోంది. అయితే, పెళ్లిచూపులకు వెళ్లినప్పుడు ఆమెలో కనిపించని ఒక విపరీత లక్షణమొకటి, పెళ్లి తరువాత బయటపడింది. ఆమెకు బల్లులూ, బొద్దింకలంటే చచ్చేంత భయం. వంట చేస్తున్న సమమయంలో బొద్దింకగానీ, బల్లి కానీ కనిపిస్తే, చేతులో ఉన్నదాన్ని దబేలున ఎత్తేస్తుంది. పాలు, అన్నం, కూర పాత్రలు అలా ఎన్ని సార్లు పడేసిందో లెక్కే లేదు.
కాసేపట్లో భోంచేసి ఆఫీసుకు వెళిపోదామనుకున్న సమయంలో అన్నీ నేలపాలైపోతే, ఖాళీ కడుపుతోనే ఆఫీసుకు వెళ్లిపోయిన సందర్భాలు ఎన్నో చాలానే ఉన్నాయి. ఆ రోజు క్యారియర్ కూడా ఉండకపోవడం వల్ల మధ్యాహ్నం భోజనం హోటల్‌లో చేయవలసిందే. నాకేమో అసలే గ్యాస్ ప్రాబ్లమ్. అందుకే హోటల్ భోజనం పడదు.
ఎప్పుడైనా ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఎప్పుడైనా భోంచేస్తే, ఆ తరువాత రెండు రోజుల దాకా విపరీతమైన గ్యాస్ ప్రాబ్లమ్‌తో బాధపడతాను. బల్లులు, బొద్దింకల భయం పోగొట్టేందుకు మేము ఎన్ని మాటలు చెప్పినా, ఆమె మనసుకు అవేవీ ఎక్కవు. చెబుతున్నంత సేపూ సరే సరే అంటుంది. తీరా అవి కనిపించేసరికి అరచి బొబ్బలు పెడుతుంది. ఆ బొబ్బలకు ఒక్కోసారి, పాప జడుసుకుంటుంది. అరిచే సమయంలో పాప మరీ దగ్గరగా ఉంటే ఆ భయం చాలా రోజుల దాకా వెంటాడుతూనే ఉంటుంది. కొద్ది రోజుల దాకా అసలు తల్లిదగ్గరకు వెళ్లనే వెళ్లదు.
ఇల్లు ఎలాగూ మారలేం!
మేం సొంతింట్లోనే వుంటున్నాం. ఇది ఊరికి చివరన ఉంటుంది. అందుకే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అప్పుడో, ఇప్పుడో ఈ బల్లులూ, బొద్దింకలు ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. అద్దె ఇల్లు అయినా ఖాళీచేసి మరో ఇంట్లోకి వెళ్లే వాళ్లం. సొంతిల్లు కావడం వల్ల ఆ అవకాశం లేదు. బొద్దింక గానీ, బల్లి గానీ, ఒకసారి కిచెన్‌లో కనిపిస్తే, ఆ తరువాత దాాపు వారం రోజుల దాకా ఆ కిచెన్‌లోకి వెళ్లనే వెళ్లదు ఒకవే ళ తప్పనిసరై వెళ్లాల్సి వస్తే, ఎవరో ఒకరు ఆమె వెంట వెళ్లాలి.
ఇంట్లో ఉన్నది ఆమె, ఇద్దరు పిల్లలు కాకుండా నేను, మా అమ్మ మాత్రమే ఉంటాం. వృద్దాప్యం కారణంగా, మా అమ్మ, వంట చేసినంత సేపూ కోడలుతో కిచెన్‌లో ఉండిపోలేదు. ఉద్యోగం కార ణంగా నేనూ ఉండలేను. అందుకే ఆమె వంటే చెయ్యదు. ఈ కారణంగా చాలా సార్లు, ఇంటిల్లిపాదికీ హోటల్ నుంచే భోజనం తెప్పించాల్సివస్తోంది. మధ్యతరగతి కుటుంబమే కాబట్టి, ఇవన్నీ ఆర్థికంగా భారమే అవుతున్నాయి. పెళ్లయిన ఈ నాలుగేళ్లుగా నాకు ఇదో పెద్ద సమస్యగా మారింది. మిగతా ఏ విషయాల్లోనూ ఆమెను త ప్పు పట్టలేం. కానీ, బొద్దింకలు, బల్లుల విషయమే మాకో పెద్ద సమస్యగా ఉంది.
చిన్న సమస్యే కానీ....
పైకి చాలా చిన్న విషయంగా కనిపించినా ఈ సమస్య, ఆమెతో మాకున్న అనుబంధాన్ని బాగా దెబ్బ తీస్తోంది. మాకూ, ఆమెకూ మధ్య రోజురోజుకూ ఏదో తెలియని దూరం పెరిగిపోతోంది. మేము అసహనాన్ని వ్యక్తం చేసిన సమయంలో ఆమె హావభావాలు చూస్తే, మాకు బాధేస్తుంది. ఆమె కావాలని అలా చేయడం లేదని మాకు తె లుసు. కానీ, కావాలని చేసినా, తెలియక చేసినా, ఆ ఇబ్బందులైతే, వేధిస్తాయి కదా! ఆమెకు తెలియకుండా ఆమెలో పెరిగిపోయిన ఈ స్వభావంతో ఈ నష్టాలన్నీ జరిగిపోతున్నాయి. నష్టాలు మాకే కాదు. ఆమె కూడా నష్టపోతోంది. ఇదే విషయమై, మాకు తెలిసిన వారితో చర్చించినప్పుడు, ఇది ఒక మానసిక రుగ్మతేనని, సైకియాట్రిస్టును సంప్రదిస్తే తప్పనిసరిగా ఆమెలో మార్పువస్తుందని చెప్పారు.
జన్యుకారణాలే మూలం
బొద్దింకలూ, బల్లుల్నీ చూసి విపరీతంగా వణికిపోవ డానికి వీరిలోని ఫోబియాలే కారణం. ఈ తరహా ఫోబియాలకు చాలా వరకు ఇంతకు ముందు జరిగిన సంఘటనలేమీ కారణంగా ఉండవు. ఎక్కువ మందిలో ఈ ఫోబియా జన్యుపరమైన కారణాలతోనే వస్తుంది. నిజానికి ఈ ఫోబియా, వాళ్ల వ్యక్తిత్వం మీద గానీ, కెరీర్ మీదగానీ, పెద్ద ప్రభావమేమీ చూపదు. బొద్దింకలను, బల్లులనూ చూసి భయపడే ఈ మనస్తత్వం మునుముందు మరేవో విపరీత ధోరణులకు దారి తీసే అవకాశం కూడా లేదు.
కాకపోతే, ఇంట్లో వాతావరణం ఎంతో కొంత దెబ్బతింటుంది. ఏమైనా సైకియాట్రిస్టు వద్ద వీరికి మంచి చికిత్స లభిస్తుంది. బొద్దింకలు, బల్లుల రబ్బరు బొమ్మలు తీసుకు వచ్చి ఎక్కువ సార్లు వాటిని వారి ముందు ఉంచాలి. ఇది సైకియాట్రిస్టు పర్యవేక్షణలోనే జరగాలి. ఆ రబ్బరు బొమ్మల్ని చూసి అదేస్థాయిలో భయపడినా, ఆ భయం క్రమంగా, తగ్గిపోతుంది.
బాల్యం నుంచీ, నిరంతరం ఈ భయాలకు లోనైన వీరి నాడీ వ్యవస్థలో కొన్ని ప్రతికూలమైన మార్పులు జరిగే ఉంటాయి. ఆ స్థితిని చక్కదిద్దడానికి వీరికి కొద్దిరోజుల పాటు మందులు కూడా ఇవ్వవలసి ఉంటుంది. అదే క్రమంలో వీరికి కౌన్సెలింగ్ కూడా అవసరమే. మందులూ, కౌన్సెలింగ్ సమాంతరంగా సాగితే, ఓ మూడు నాలుగు మాసాల్లో ఎంతో మార్పువస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా, వెంటనే, సైకియాట్రిస్టును సంప్రదిస్తే, ఈ ఫోబియా పూర్తిగా తొలగిపోతుంది.
డా.ఎం.ఎస్. రెడ్డి
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
ఆశా హాస్పిటల్, హైదరాబాద్
సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల







0 comments:
Post a Comment