కంటిచుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల మనం క్రీములు, లోషన్లు, ఇతర ప్రొడక్టులను వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉంటేనే ఉపయోగించాలి. గతంలో 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఈ సమస్య ఉన్నవాళ్లు ఎక్కువ శాతం కనిపించేవారు. ఎందుకంటే ఆ వయసులో బాడీ మెటబాలిజం, హార్మోన్లలో చోటుచేసుకునే మార్పుల వల్ల ఇలాంటి సమస్య కనిపించేది. కాని, ఇప్పుడు మన జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి.
రాత్రి సమయాల్లో ఎక్కువ మేల్కొనడం, ఆహార నియమాలు పాటించక పోవడం, శరీరానికి అవసరమైన స్థాయిలో విటమిన్లు, పోషకాలు అందించే ఆహారం తీసుకోకపోవడం, ఐరన్ లోపం, బి - కాంప్లెక్స్ తక్కువగా ఉండటం, మానసిక ఆందోళనలు, బి.పి., షుగర్ వంటి వ్యాధులు, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోవడం, కిడ్నీల్లో సమస్యలు, ఇలా వివిధ కారణాలవల్ల కంటి చుట్టూ చర్మం నల్లగా మారే అవకాశం ఉంది.
కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను 20యేళ్ల వయసులో ఉన్నవారిలో కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఈ కంప్యూటర్‌పై పనిచేసే శాతం చాలా ఎక్కువైంది. ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు ఉండటం వల్ల కూడా కళ్లు ఒత్తిడికి గురవుతాయి. మానసిక ఒత్తిడి ప్రభావంవల్ల కూడా ముందుగా కళ్లచుట్టూ ఉండే చర్మం పొడిబారుతుంది. తరువాత లైట్ బ్రౌన్ కలర్‌లోకి మారి, సరైన జాగ్రత్త లేనందు వల్ల నల్లటి వలయాలు ఏర్పడతాయి.
అందుకే కంప్యూటర్ ముందు పనిచేసేవారు ప్రతి రోజూ కంటికి సంబంధించిన వ్యాయామం చేయాలి. మెడ, షోల్డర్స్, చేతివేళ్లకి సంబంధించిన వ్యాయామాలు నాలుగుగంటలకోసారి చేయాలి. దీనివల్ల శరీరం ఎప్పుడూ ఒకే తీరులో ఉండకుండా కదలికల్లో మార్పును సంతరించుకుని కొంత సేదతీరే అవకాశం ఏర్పడుతుంది.
వాకింగ్, యోగాలాంటివి కూడా రోజుకు కనీసం 20 నిముషాలు చేస్తే మెదడు చురుకుగా మారి, కంటి చుట్టూ ఉండే నరాల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ప్రతి 15రోజులకోసారి హెడ్ మసాజ్ కూడా చేయించుకుంటే మంచిది.
ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా 8నుంచి 14 సంవత్సరాలలోపు వాళ్లలో ఈ సమస్యలు చూస్తున్నాం. ఎందుకంటే వీళ్లు వీడియో గేమ్స్, కార్టూన్ షోలు స్క్రీన్‌కి చాలా దగ్గరగా ఉండి ఆడుతుంటారు, చూస్తుంటారు. దీనివల్ల శక్తికి మించి కళ్లు అలసిపోవడం కూడా వలయాలకు కారణం అవుతుంది. పిల్లలు ఊరికే అలగటం, చిరాకుపడటం, మానసికంగా ఏదో పోగొట్టుకున్నట్లు బాధపడటంలాంటి లక్షణాల వల్ల వాళ్ల మెదడు, కళ్లచుట్టూ ఉండే నరాలు బాగా ఒత్తిడికి లోనై ఈ సమస్యలు వస్తున్నాయి.
స్త్రీలలో అబార్షన్ తరువాత, డెలివరీ తరువాత, మెనోపాజ్ దశల్లో శరీరానికి సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంవల్ల ఈ సమస్య కనిపిస్తుంది. క్లినిక్స్‌లో వీటికి మంచి చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 5నుంచి 8 సిట్టింగ్స్‌లో ఫలితాన్ని పొందవచ్చు..
గమనిక:
ఇలాంటి సమస్యలనుంచి బయటపడాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. సమస్యను గుర్తించిన వెంటనే దగ్గర్లో ఉన్న మంచి బ్యూటీ క్లినిక్‌కు వెళ్లి సరైన ట్రీట్‌మెంట్‌తో పాటు, ఇంట్లో పాటించాల్సిన జాగ్రత్తలు కూడా అడిగి తెలుసుకోవాలి. పదిహేను రోజులకు ఒకసారి తప్పనిసరిగా హెడ్‌మసాజ్ చేయించుకోవాలి. కంటి కింద నల్లటి వలయాలు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది.







0 comments:
Post a Comment