నాలుగు పదులైనా గడవకముందే నడవలేనంత ఈ నీరసం ఏమిటి? అనుక్షణం లక్ష్యం కోసం ఏదో చేసేయాలన్న పెద్ద ఆరాటం మనసులో. కానీ, ఏచిన్న పనిచేయాలన్నా ఎక్కడలేని నిస్సత్తువ. నిరుత్సాహం. ఆలోచనలు లోతైనవే. ప్రణాళికలూ బలమైనవే కానీ, ఆచరణలోనే అన్నీ అడ్డంకులు. కొద్ది నిమిషాలు పనిచేస్తే చాలు. ఒళ్లంతా హూనమైపోయిన ట్లు అనిపిస్తుంది. శరీరానికి అందే పోషకాల్లో ఏమీ లోపం లేకపోయినా, ఇంత అశక్తత ఎందుకు? అంటే నిపుణులు చెప్పే కారణాలు ఇలా ఉన్నాయి.
సాధారణ దృష్టికి కనిపించని ఎన్నో జబ్బులు మన శరీరాన్ని కృశింప చేస్తూ ఉంటాయి. పైకి ఏమీ కనిపించని కారణంగానే వారంతా తాము చాలా ఆరోగ్యంగానే ఉన్నామనుకుంటారు. కానీ, మరోపక్క రోజు రోజుకూ పెరిగిపోతున్న నీరసం గుబులు పుట్టిస్తుంది. నిజానికి నీరసం అనేది కేవలం శక్తిహీనతే కాదు. అది కొన్ని వ్యాధులను తెలిపే సూచిక కూడా. వృద్ధుల్లో ఇవి కొంత సహజమే అయినా యువకులు, మధ్య వయస్కులు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ నీరసం ఉత్సాహాన్నే కాదు, కార్యదక్షతనూ దెబ్బతీస్తుంది. మామూలుగా అయితే నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలు వేసవి కాలంలో ఎక్కువగానే ఉంటాయి. అవసరమైనంత నీరు తాగకుండా అతిగా ఎండలో తిరగడమే అందుకు కారణం. ఎక్కువ సేపు ఎండలో తిర గడం వల్ల శరీర కణాల్లో ఉండే నీరు, ఉప్పుతో పాటు ఇతర లవణాలన్నీ ఆవిరైపోతాయి. ఈ స్థితిలో శరీరంలోని కణజాలమంతా నీటికోసం తపిస్తుంది. ఇలాంటి స్థితి ఎప్పుడో అరుదుగా ఏర్పడితే దాని వల్ల అంత పెద్ద దుష్ప్రభావమేదీ ఉండకపోవచ్చు. కానీ, నిరంతరం శరీరంలో నీరు, లవణాలూ కొరవడుతూ ఉంటే శరీరం బాగా నీరసించిపోతుంది. అంతిమంగా ఇది కండరాల నొప్పికి, నాడీమండల వ్యాధులకూ దారి తీస్తుంది. అయితే కొందరిలో రుతువులతో సంబంధం లేకుండానే నిస్సత్తువ ఆవరిస్తుంది.
మధుమేహంతో...
నీరు, లవణాల కొరతతో వచ్చే నీరసానికి మధుమేహం కూడా తోడైతే సమస్య రెట్టింపవుతుంది. నీరసాన్ని మధుమేహ లక్షణంగా అనుమానించడానికి ఇదే కారణం. ఇన్సులిన్ లోపాల వల్ల మధుమేహుల్లో చక్కెర కణజాలానికి అందకుండా రక్తంలోనే ఉండిపోతుంది. ఫలితంగా శరీర కణజాలమంతా నిర్జీవంగా మారిపోతుంది. అందుకే నీరసం అధికంగా అనిపించినప్పుడు మధుమేహ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. అలాగే శరీరంలో నీరు, లవణాలు ఏ పరిమాణంలో ఉన్నాయో కూడా పరీక్షించుకోవాలి.
క్షయ వ్యాధి సోకినా...
క్షయ వ్యాధి పీడితుల్లో మొట్టమొదటగా కనిపించే లక్షణం నీరసమే. క్షయ తీవ్రమవుతున్నప్పుడు శరీర కణజాలం క్షీణిస్తూ వెళుతుంది. క్షీణించగా మిగిలిన ఆ కణజాలం మీదే జీవక్రియల భారమంతా పడుతుంది. అందుకే ఆ దశలో జీవక్రియలు అంత సమర్థవంతంగా సాగవు. వ్యాధి ముదిరే కొద్దీ శరీరంలో క్యాలరీలు తగ్గిపోతాయి. ఫలితంగా నిర్వహణా సామర్థ్యంలో లోటు పాట్లు ఏర్పడతాయి. క్షయలోనే కాకుండా శరీరం ఇన్‌ఫెక్షన్ల బారిన పడిన అన్ని సందర్భాల్లోనూ నీరసమే ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే క్యాన్సర్లలోనూ తొలుత ఆకలి తగ్గిపోతుంది. ఫలితంగా తీసుకునే క్యాలరీలు తగ్గి శరీరం నీరసించిపోతుంది.
కార్డియోమయోపతి
గుండె కండరాలు దెబ్బతినే కార్డియోమయోపతిలోనూ నీరసం ఉంటుంది. ఈ సమస్యతో గుండె బలహీనంగా పనిచేయడం వల్ల రక్తప్రసరణ సరిగా ఉండదు. ఫలితంగా శరీర కణజాలానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. ఇవన్నీ కణాలు క్షీణించిపోయేందుకు కారణమవుతాయి. ఈ స్థితిలో ఉన్న కణాల మీదే మొత్తం శరీర వ్యవస్థ తాలూకు భారమంతా పడుతుంది. నీరసంతో పాటు వీరికి ఏ కాస్త నడిచినా ఆయాసం మొదలవుతుంది. నిజానికి చాలా వ్యాధుల్లో నీరసమే తొలి లక్షణంగా కనిపిస్తుంది. అందుకే నీరసం కారణంగా వైద్యుణ్ని కలసినప్పుడు నీరసంతో పాటు మరేవైనా ఇతర లక్షణాలు ఉన్నాయేమో పరిశీలిస్తారు. ప్రధానంగా తరుచూ, దగ్గు, జ్వరం వస్తున్నాయేమో తెలుసుకుంటారు. అలాగే ఆకలి సరిగా ఉందో లేదోనని కనుక్కుంటారు. నిజానికి ఈ సాధారణ వివరాల ద్వారానే 70 శాతం వ్యాధులను గుర్తించే వీలుంది. అయితే వ్యాధి నిర్ధారణకు గానీ, వ్యా«ధి ఏదశలో ఉందో తెలుసుకోవడానికి గానీ, వైద్య పరీక్షలు తప్పనిసరి అవుతాయి.
నీరసం-ఆయాసం
నీరసం, ఆయాసం ఈ రెండూ వేరు వేరు. కానీ, కొందరు ఆయాసాన్ని నీరసంగా పొరబడుతుంటారు. ఆయాసం శరీరానికి అవసరమమైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల తలెత్తే సమస్య. దీనికి శ్వాసకోశాల్లోని లోపాలు, గుండె జబ్బులు ప్రధాన కారణంగా ఉంటాయి. వీటివల్ల అతి త్వరగా అలసిపోవడం, పదేపదే విరామం తీసకుంటే తప్ప అడుగు ముందుకు సాగని పరిస్థితి ఉంటుంది. తీవ్రంగా వ్యాధిగ్రస్తమైన వారిలో జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వీరికి అతి సులువుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలే ఇవ్వాలి. అంటే కార్బోహైడ్రేట్లు వీరికి సులువుగా జీర్ణమవుతాయి. నిజానికి ఈ స్థితిలో వీరికి ప్రొటీన్లు కూడా అవసరమే. అయితే సులభంగా జీర్ణం కావడానికి జంతు సంబంధమైన ప్రొటీన్లు కాకుండా, వృక్షసంబంధమైన ప్రొటీన్లు ఇవ్వడం మేలు. పప్పులు, చిక్కుడు ధాన్యాలకు ప్రాధాన్యతనిస్తే మంచిది.
నియంత్రణలో..
ఏ వ్యాధినైనా అన్ని కోణాల నుంచి పరిశీలిస్తూ అన్ని వైపుల నుంచీ చక్కబరుస్తూ రావాలి. పైగా వ్యా«ధి గ్రస్తులు కేవలం మందులు వాడటంతోనే అంతా అయిపోదు. వైద్య చికిత్సలతో పాటు వ్యాధిని అనుసరించి ఆహారాన్ని కూడా ఎంచుకోవాలి.కి డ్నీ సమస్యలు ఉన్నప్పుడు ఆహారంలో ప్రొటీన్లు తగ్గించి, కార్బోహైడ్రేట్ల పరిమాణం పెంచాలి. ఒకవేళ మధుమేహం ఉంటే కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రొటీన్ పరిమాణం పెంచాలి. వ్యాయామానికి కూడా ప్రాధాన్యతనివ్వాలి. ఏమైనా స్వల్పకాలికంగా ఉండి తగ్గిపోయే నీరసం గురించి అంత ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీర్ఘకాలికంగా ఉంటూ, తరుచూ నీరసం ఆవహించడం ఉంటే సాధ్యమైనంత త్వరగా వైద్యుడ్ని సంప్రదించి, అవసరమైన వైద్య చికిత్సలు తీసుకోవడం ఎంతో అవసరం అంటారు నిపుణులు.
సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల







0 comments:
Post a Comment