ఉదయాన్నే టిఫిన్ తీసుకోవడం వల్ల పలు రకాలైన వ్యాధుల బారినపడకుండా మనల్ని మనం కాపాడు కోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనలో చాలా మంది బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో ఉదయం పూట టిఫిన్ చేయడం మానేస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల షుగరు వ్యాధి వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఉదయం పూట మనం తీసుకునే అల్పాహారం వల్ల షుగరు, హైబీపి, గుండెజబ్బు వంటి వ్యాధుల నుండి కూడా దూరంగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టెల్ అవైన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ తాజా విషయం తేలింది. అంతేకాకుండా ఉదయం పూట మనం తీసుకునే టిఫిన్‌లో కేలరీలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మరింత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం పూట మనం తీసుకునే అల్పాహారం మన శరీరంలోని జీవగడియారం రోజంతా కూడా సజావుగా సాగేలా చూస్తుందని అందువల్ల శరీరం ఆహారాన్ని గ్రహించే ప్రక్రియపై మనం ఆహారాన్ని తీసుకునే సమయం గణనీయమైన ప్రభావం చూపుతోందంటున్నారు. రాత్రిపూట పెద్ద మొత్తంలో ఆహారం తీసుకునే వారితో పోలిస్తే ఉదయం పూట ఎక్కువగా అల్పాహారం తీసుకున్న వారిలో బరువు, నడుం చుట్టుకొలత మరింత ఎక్కువగా తగ్గుతున్నట్టు వారు గుర్తించారు. అలాగే అల్పాహారంలో ఒక ముక్క చాక్లెట్ కేక్‌ను కూడా కలిపి తింటే ఇన్సులిన్, గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్ల మోతాదులు కూడా గణనీయంగా తగ్గుతున్నట్టు వీరి పరిశోధనలో తేలింది. ఈ ఇన్సులిన్, గ్లూకోజ్ వంటివి షుగరు, హైబీపి, గుండె జబ్బులను తెచ్చిపెట్టేవే కావడం వల్ల ఉదయం పూట పెద్ద మొత్తంలో అల్పాహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సేకరణ: వార్త







0 comments:
Post a Comment