Pages

Subscribe:

Ads 468x60px

Showing posts with label tensions. Show all posts
Showing posts with label tensions. Show all posts

Monday, 16 December 2013

పరీక్షల సమయంలో ఒత్తిడి అవసరమా

మార్చి, ఏప్రిల్ నెలలు వచ్చాయంటే చాలు, విద్యార్థుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. విద్యార్థులతో పాటు వారి త ల్లితండ్రులకూ, ఉపాధ్యాయులకూ కంటి మీద కునుకు ఉండదు. పరీక్షా సమయాల్లోనే కాదు, పరీక్షా ఫలితాలు వెలువడే సమయంలో కూడా విద్యార్థుల్లో టెన్షన్‌కు అంతుండదు. విద్యార్థులకు దాదాపు ఏడాదంతా ఏదో ఒక కారణంగా ఒత్తిడి ఉండడం కూడా ఇప్పుడు సర్వసాధారణ విషయం. ఈ టెన్షన్ వల్ల విద్యార్థులు రకరకాల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. పరీక్ష రాయడంలో ఏ మాత్రం తృప్తి తక్కువైనా మానసికంగా కుంగిపోవడం, ఆత్మహత్యలకు పాల్పడడం కూడా ఎక్కువైంది. పరీక్షల సమయంలో అసాధారణ మానసిక ఒత్తిడి కారణంగా అనారోగ్యాల పాలవుతున్న విద్యార్థుల సంఖ్య దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైచిలుకే ఉండగా, పరీక్షలు సరిగ్గా రాయనందుకో, ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నందుకో, ఫెయిల్ అయినందుకో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య ఏడాదికి మూడు వేలకు పైబడే ఉంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ రికార్డులు తెలియజేస్తున్నాయి.

అయితే, పరీక్షలు, ఫలితాల సందర్భంగా విద్యార్థుల్లో టెన్షన్ పెరగకుండా ఉండడానికి, విద్యార్థులు తమకు తాముగా దీన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కార మార్గాన్ని రూపొందించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, జాతీయ గ్రామీణ ఆరోగ్య సంస్థ (ఎన్.ఆర్.హెచ్.ఎం)లు కలిసి ఇటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ఏడాది నుంచి 24 గంటల 'హెల్త్ హెల్ప్‌లైన్'ను ప్రారంభించింది. ఈ హెల్ప్‌లైన్‌కు 'దిశ' అని పేరు పెట్టింది. దీన్ని ఇంగ్లీషులో 'డైరెక్ట్ ఇంటర్వెన్షన్ సిస్టమ్ ఫర్ హెల్త్ అవేర్‌నెస్' అంటారు. విద్యార్థులు ప్రశాంతంగా, నిబ్బరంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో చదువుకోవడానికి, పరీక్షలు రాయడానికి తోడ్పడడమే ధ్యేయంగా ఈ ఉచిత సేవ ప్రారంభమైంది.

ప్రస్తుతానికి ఈ సేవలు మార్చి నుంచి మే నెల వరకే లభ్యమవుతాయి. వీటిని త్వరలో నవంబర్ వరకూ తీసుకు రావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మున్ముందు వీటిని అన్ని రకాల పరీక్షలకు, ఏడాది పొడుగునా అందించాలని కేంద్రం భావిస్తోంది. మొదట్లో కేరళకు మాత్రమే పరిమితమైన ఈ సేవలు ఇతర రాష్ట్రాలకూ విస్తరించాయి. పరీక్షల టెన ్షన్‌లో ఉన్న విద్యార్థులు ఉదయం 10.56 గంటల తరువాత '1056' నంబర్‌కి ఫోన్ చేసి, తమ సమస్యను తెలియజేయాలి. ఆ ఫోన్ కాల్‌ను తీసుకున్న కౌన్సెలింగ్ అధికారులు విద్యార్థుల సమస్యకు వెంటనే పరిష్కారం చెబుతారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తారు. అనేక విధాలుగా ధైర్యం చెబుతారు. విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థయిర్యాన్ని పాదుకొల్పేందుకు ప్రయత్నం చేస్తారు.

అవసరమైతే దేశంలోని ప్రసిద్ధ మానసిక వైద్యులకు విద్యార్థి సమస్యను వివరించి, వారితోనే విద్యార్థికి ఫోన్ చేయిస్తారు. ప్రధాన ఆస్పత్రులలోని కౌన్సెలింగ్ సెంటర్లకు కూడా ఆ ఫోన్ కాల్‌ను బదిలీ చేస్తారు. సాధారణంగా మానసిక ఒత్తిడి ఏదో ఒక శారీరక అనారోగ్యానికి దారి తీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. పరీక్షల భయంతో పరీక్షలకు గైర్హాజర్ అయ్యే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థలో పనిచేస్తున్న ప్రసిద్ధ మానసిక వైద్యుడు డాక్టర్ రిజ్వాన్ అహ్మద్ చెప్పారు. ఉద్యోగ రంగంలో కంటే విద్యారంగంలోనే మానసిక ఒత్తిడి స్థాయి తీవ్రంగా ఉంటోందని, విద్యార్థులలో ఎక్కువ శాతం మంది పరీక్షలను తట్టుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు.

విద్యార్థుల్లో మధుమేహం, రక్తపోటు, నరాల బలహీనత, మూత్రపిండాల సమస్య, మాడుపోటు, కంటి వ్యాధులు వంటివి ప్రబలడానికి దారి తీస్తున్న మానసిక ఒత్తిడిని తగ్గించడం మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. వైద్య, విద్యారంగ నిపుణులతో కలిసి, ఈ హె ల్స్‌లైన్‌ను చేపట్టింది. ప్రస్తుతానికి 14 నుంచి 22 ఏళ్ల లోపు విద్యార్థులకు అంటే, స్కూల్ ఫైనల్ నుంచి డిగ్రీ, పీజీ వరకూ వర్తింపజేస్తున్న ఈ హెల్ప్‌లైన్ సేవను క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని రకాల పరీక్షా సమయాలకూ వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు ఈ సేవను ఉపయోగించుకుంటున్నారని, వారి నుంచి వస్తున్న స్పందన కూడా ప్రోత్సాహకరంగా ఉంటోందని ఎన్.ఆర్.హెచ్.ఎం అధికారులు చెప్పారు.

"ప్రస్తుతానికి 24 మంది కౌన్సెలర్లు, ఆరుగురు మానసిక వైద్యులు ఈ ఫోన్ కాల్స్‌ను తీసుకుంటున్నారు. ఈ పథకం పురోగతిని బట్టి ఈ సంఖ్యను పెంచడం జరుగుతుంది. పలువురు కౌన్సెలర్లు, మానసిక వైద్యులు ఈ పథకంలో చేరి విద్యార్థులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అవసరాన్ని బట్టి వారి సేవలను కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఒకేసారి 30 కాల్స్‌ను తీసుకోవడానికి అవకాశం కల్పించాం. ఫోన్ నంబర్లను రికార్డు చేసుకుని మేమే మళ్లీ ఫోన్లు చేస్తాం'' అని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వివరించారు.

సేకరణ: ఆంధ్రజ్యోతి, సకల