Pages

Subscribe:

Ads 468x60px

Wednesday, 19 September 2012

మలేరియా మళ్లీ విజృంభిస్తోంది...!

ప్లాస్మోడియా అనే సూక్ష్మజీవి దోమ కాటు వల్ల మనిషి రక్తంలోకి ప్రవేశించడం వల్ల మలేరియా వస్తుంది. ఈ జ్వరంలో తీవ్రమైన వణుకు, చలి జ్వరం వస్తాయి. జ్వరం విడిచి విడిచి వస్తుంది. మలేరియా చాలా పాత జబ్బు. పరిణామ క్రమంలో కోతి జాతుల నుండి మనిషి విడిపోకముందే 'మలేరియా క్రిమి' ఉంది. మలేరియా చెడ్డగాలి వల్ల వస్తుందనుకునేవాళ్లు. కానీ వంద ఏళ్లకు ముందు ఒక భారతీయ మిలటరీ డాక్టరు దోమల వల్ల మలేరియా వస్తుందని కనుగొన్నారు. ఆయన పేరే రొనాల్డ్‌ రాస్‌. రాష్ట్రంలోని సికింద్రాబాద్‌లోనే ఆయన పరిశోధనలు సాగాయి.
ఒకప్పుడు మలేరియా ప్రపంచమంతటా ఉండేది. కానీ ఇప్పుడు ఆఫ్రీకా, ఆసియాలలోని పేద దేశాల్లోని ప్రధానంగా ఉంది. స్వాతంత్య్రం తర్వాత మన దేశంలో కూడా మలేరియాను నియంత్రించారు. కానీ మలేరియా మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఇది ఎక్కువ. మలేరియా ఎలా వస్తుంది? ఎలా నివారించాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందరూ కలసి ఏం చేయాలి? అనే అంశాలు జనవిజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్‌ ఎం.గేయానంద్‌ 'రక్ష' పాఠకుల కోసం వివరించారు.

మలేరియాను సులువుగా కనుక్కోవచ్చా?
మలేరియాను కనుక్కోవడం చాలా సందర్భాల్లో సులుభమే. మలేరియాలో జ్వరం రోజూ రావొచ్చు. లేదా రోజు విడిచి రోజు రావచ్చు. జ్వరం ప్రారంభం కావడానికి ముందే బాగా చలి, వణుకు వస్తుంది. ఒక అరగంట తర్వాత జ్వరం ప్రారంభమై పెరుగుతూ పోతుంది. 106 డిగ్రీల ఫారెహీట్‌ దాకా (హై ఫీవర్‌) కూడా రావొచ్చు. కొన్ని గంటల తర్వాత జ్వరం దానికదే తగ్గిపోతుంది. ఏ మందులు వాడకపోయినా తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయేప్పుడు చమటలుపడతాయి. అంటే ఈ జ్వరంలో మూడు దశలుంటాయి. 1. చలి, వణుకు దశ. 2. హై ఫీవర్‌. 3. చెమటపట్టడం తగ్గిపోయే దశ. తగ్గిపోయినట్లుంటుది కానీ మళ్లీ తర్వాతి రోజు ఈ మూడు దశల్లో జ్వరం వస్తుంది. అయితే అరకొర వైద్యం చేసుకుంటే ఈ దశలన్నీ కలకలసిపోవచ్చు. మన రాష్ట్రంలో ఏ జ్వరమైనా సరే మలేరియా కావొచ్చనంత ఎక్కువ మలేరియా ఉంది.

మలేరియాలో ఇతర లక్షణాలేమైనా ఉంటాయా? ఏ విధంగా నిర్ధారణ చేయాలి?
జ్వరంతోపాటు నిస్సత్తువ, తలనొప్పి, వాంతి వంటి ఉపలక్షణాలు కూడా ఉండొచ్చు. అయితే ఈ ఉపలక్షణాలు ఉన్నా, లేకున్నా కూడా అది మలేరియా కావొచ్చు. చిన్న పిల్లల్లో ఈ లక్షణాలన్నీ ఉండకపోవచ్చు. కొన్ని రకాల మలేరియా వల్ల మెదడు, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటాయి. ఈ అవయవాలకు చెందిన లక్షణాలు కనిపిస్తే, అది 'ప్రమాదకరమైన మలేరియా'గా (ఫాల్సిఫారం అనే మలేరియా క్రిమి ద్వారా ఇది వస్తుంది) భావించాలి. మలేరియానా? కాదా? అని కనుక్కోవడానికి 'రక్తపరీక్ష' అవసరం. మైక్రోస్కోపును ఉపయోగించి ఈ పరీక్ష చేస్తారు. ఇతర 'రక్తపరీక్షలున్నా అవి ఖరీదు ఎక్కువ. ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనైనా (మైక్రోస్కోపు పరీక్ష) ఉచితంగా ఈ పరీక్ష చేస్తారు.

జ్వరం లేకపోయినా మలేరియా ఉండొచ్చా?
జ్వరం లేకుండా మలేరియా ఉండడం అరుదు. కానీ డయేరియా, కాళ్లనొప్పులు, దగ్గు, తలనొప్పి-లాంటి లక్షణాలున్న వారి రక్తం పరీక్షించినప్పుడు 'మలేరియా సూక్ష్మజీవి' ఒక్కోసారి కనిపిస్తుంది. అంటే మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న అనేక ఆరోగ్య సమస్యలకు మలేరియానే కారణం కావొచ్చు !

మలేరియా కొన్ని సీజన్లలోనే ఎందుకు వస్తుంది?
దోమలు పెరగాలంటే పొడి, తడి వాతావరణం ఉండాలి. కాబట్టి వర్షాకాలంలో తగిన నీరు, ఉష్ణోగ్రత కూడా ఉంటాయి. కాబట్టి దోమలు ఎక్కువ అవుతాయి. కాబట్టి మలేరియా కూడా ఎక్కువ అవుతుంది.

ఎవరిలో ఎలా సోకుతుంది? దోమ కాటు వేసిన వెంటనే మలేరియా వస్తుందా?
మలేరియా ఉన్న వ్యక్తిని దోమ కాటు వేసిందనుకోండి. అప్పుడు ఆ దోమ జీర్ణాశయంలోకి మలేరియా సూక్ష్మజీవి చేరుకుంటుంది. అక్కడే ఉండి ఒక వారం, రెండు వారాల్లో అవి వృద్ధి అవుతాయి. ఈ దోమ మరో సాధారణ వ్యక్తిని కరిస్తే, అతనికి మలేరియా సోకుతుంది. రక్తమార్పిడి ద్వారా కూడా మలేరియా సోకుతుంది.

మలేరియా అనుమానం ఉంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది?
రక్తపరీక్ష చేయించుకోవాలి. పరీక్ష వీలుకాకపోతే లక్షణాల ఆధారంగా, మలేరియా మందులు వాడాలి. క్వోరోక్విన్‌ ఇస్తారు. పత్యం అవసరం లేదు. అంటే అన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకోవచ్చు. బాగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. మలేరియా జ్వరం కాకపోయినా, జాగ్రత్త కోసం మలేరియా మందులు వాడొచ్చు. మలేరియా ప్రాంతాల్లో జ్వరం ఒక్కటే వస్తూ ఉండి ఇంకా ఇతర ఏ లక్షణాలు కనిపించకపోయినా మలేరియాగా వైద్యం చేయవచ్చు. ప్రమాదకరమైన మలేరియా (ఫాల్సిఫారం మలేరియా)కు సత్వర చికిత్స అవసరం. క్వినైన్‌ అనే మందు వాడాల్సి ఉంటుంది. ఈ మలేరియా వచ్చిన వారిలో మూడు నుండి నాలుగు శాతం మరణించే అవకాశముంది. మలేరియా ప్రమాదకరంగా, తీవ్రంగా ఉన్నప్పుడు ఇంజెక్షన్లూ, సెలైన్లూ అవసరమవుతాయి. మలేరియాకు మందులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ప్రభుత్వాసుపత్రుల్లో ఇవ్వాలి.

మలేరియా మందులు పూర్తి కాలం డోసు ఎందుకు వాడాలి?
మలేరియా మందులు (క్లొరోక్విన్‌లు) మింగిన మొదటి రోజే మలేరియా క్రిములు చాలా భాగం చనిపోతాయి. కానీ కొన్ని క్రిములు ఇంకా రెండు, మూడు రోజులు బతికి ఉంటాయి. వీటిని కూడా మందులు వాడి పూర్తిగా నిర్మూలించాలి. లేకపోతే ఈ బలమైన క్రిములు తప్పించుకుని, పెరిగి, మళ్లీ మలేరియాకు కారణం అవుతాయి. ఇవి దోమల ద్వారా మళ్లీ ఇతరులకు వ్యాపించినప్పుడు, వైద్యానికి త్వరగా లొంగవు. కాబట్టి మలేరియా మందులను పూర్తి డోసులో, పూర్తి కోర్సును వాడాలి.

రాడికల్‌ ట్రీట్‌మెంట్‌ అంటే?
క్లోరోక్విన్‌ వాడిన తర్వాత ప్రైమాక్విన్‌ అనే మందును కూడా వాడటాన్ని 'రాడికల్‌ ట్రీట్‌మెంట్‌' అంటారు. మలేరియా క్రిములు (ముఖ్యంగా వైనాక్స్‌ క్రిమి) దోమ కాటు ద్వారా మనిషి రక్తంలోకి ప్రవేశించిన తర్వాత అవి ఒకటి, రెండు వారాలయ్యాక కాలేయంలోకి వెళ్లి దాక్కొంటాయి. ఇవి అప్పుడప్పుడు బయటకు వచ్చి మలేరియాను కలుగజేస్తాయి. క్లోరోక్విన్‌ మందు రక్తంలో ఉన్న క్రిములను మాత్రమే చంపుతాయి. ప్రైమాక్విన్‌ అనే మందు కాలేయంలో ఉన్న క్రిములను కూడా చంపుతుంది. ఈ రెండు మందులనూ వాడటాన్ని 'రాడికల్‌ ట్రీట్‌మెంట్‌' అంటారు. మలేరియా జ్వరం, దోమలూ ప్రబలి ఉన్న ప్రాంతాల్లో ప్రైమాక్విన్‌ మందు వాడాలా? వద్దా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి.

గర్భిణులకు, చిన్న పిల్లలకు మలేరియా వైద్యం సురక్షితమా?
గర్భిణులు, చిన్న పిల్లల్లో మలేరియా వచ్చే అవకాశాలు మామూలు కంటే ఎక్కువ. మలేరియా జ్వరం వల్ల కొన్ని సార్లు గర్భంలోని బిడ్డ చనిపోయే అవకాశముంది. కాబట్టి క్లోరోక్విన్‌ లాంటి మందులు గర్భిణులు తప్పకుండా వాడాలి.

అన్ని రకాల దోమల వల్లా మలేరియా వస్తుందా?
అన్ని దోమలు మలేరియాకు కారణం కావు? 'అనాఫిలస్‌' అనే ఒకానొక రకం దోమ ( ఈ దోమ గోడ మీద వాలినప్పుడు తోక ఏటవాలుగా గాలిలోకి ఉంటుంది) వల్ల మలేరియా వ్యాపిస్తుంది. వీటిలో కూడా మగ దోమలు కుట్టలేవు. ఆడ అనాఫిలస్‌ దోమలు-అవి గుడ్లు పెట్టేందుకై, అవసరమైన ప్రోటీన్ల కోసం మాత్రమే కుట్టీ, కుట్టీ మానవ రక్తాన్ని పీలుస్తాయి. మన దేశంలో 58 రకాల అనాఫిలస్‌ దోమలున్నా, వాటిలో 6 రకాలు మాత్రమే మలేరియాను వ్యాపింపజేస్తాయి. ఆడ అనాఫిలస్‌ దోమలు శుభ్రమైన, తాజాగా ఉన్న నీటిలో గుడ్లుపెడతాయి. ఈ గుడ్ల నుండి లార్వాలు పుడతాయి. ఒక వారం తర్వాత ఈ లార్వాల నుండి దోమలు ఏర్పడతాయి.

మలేరియా నియంత్రణ బాధ్యత ఎవరిది?
మలేరియా నియంత్రణ అంటే దోమల నియంత్రణ. దోమల నియంత్రణ సమిష్టిగానే సాధ్యం. అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం దోమల నియంత్రణ కోసం సీరియస్‌గా కృషి చేస్తుందనే విశ్వాసం ప్రజల్లో కలగినప్పుడే సహకరిస్తారు.

మలేరియా నుండి రక్షణ కోసం తీసుకోవాల్సిన వ్యక్తిగత జాగ్రత్తలు ఏమిటి?
దోమతెరలు వాడాలి. క్రిమి సంహారక పూత ఉన్న దోమతెర అయితే చాలా మంచిది. శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తుల వేసుకోవాలి. వేప పొగపెట్టాలి. వేప నూనె, సిట్రెనెల్లా నూనె ఒంటికి పూసుకోవడం లాంటి చర్యలు ఉపయోపడతాయి. కాయిల్స్‌, మస్కిటో రిపెల్లంట్‌ వాడొచ్చు.

సమిష్టిగా ఏం చేయాలి?
దోమలు కనీసం ఒక కిలోమీటరు దూరం ప్రయాణిస్తాయి. కాబట్టి మనమో, మన కుటుంబమో మాత్రమే దోమకాటు నుండి పరిరక్షించుకుందామంటే అది సాధ్యపడదు. అందుకే ఒక గ్రామంలో, ఒక ప్రాంతంలో దోమల నివారణకై అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలి. ఏ ప్రాంతలోనైనా ఏడు నుండి పది రోజులు నీరు నిల్వ ఉంటే అక్కడ దోమలు పుట్టే అవకాశముంది. కాబట్టి వెదురు బొంగులు, టైర్లు, పగిలిన బాటిళ్లు, పశువుల కాలి ముద్రలు, ప్లాస్టిక్‌ సంచులు, టెంటకాయలు, పారేసిన పాత్రలు, బావులు, చిన్న చిన్న చెలమలు... వీటిలో నీళ్లు నిలిస్తే అవి దోమలు కారణం అవుతాయి. కాబట్టి మన ఇంట్లో కానీ, ఇంటి చుట్టు పక్కలకానీ, ఇటువంటి వస్తువులు లేకుండా, వాటిలో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

బావులు, చెలమలు పూర్తిగా మూతలు పెట్టేందుకు ప్రయత్నం చేయాలి. కొళాయిల వద్ద నిలిచే నీళ్లలో, మడుగుల్లో కిరోసిన్‌, వేస్ట్‌ ఆయిల్‌ చల్లితే లార్వాలు పెరగవు. ఇంట్లో బయటా డిడిటి స్ప్రే చేయాలి. పశువుల కొట్టంలో అవసరం లేదు. వరి పొలంలో ఉండే నీళ్లలో, చెరువుల్లో దోమ లార్వాలను తినే గంబూషియా చేపలు వదలమని ప్రభుత్వాని అడగాలి.

సేకరణ: ప్రజాశక్తి
Enter your email address:

0 comments:

Post a Comment