ఋతువులు మారుతున్నాయి. వాటితో పాటే జీవితంలో అనుభూతులు మారుతున్నాయి. శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ వసంతకాలంలో చిగురించి చెట్లుకు కొత్త అందాన్నిస్తున్నాయి. ఈ వసంతరుతువులో వచ్చే తొలి మాసం చైత్రం. అందుకే దీనినే తెలుగు సంవత్సరాదిగా పేర్కొంటారు. అదే ఉగాది. ఉగాది అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది ఉగాది పచ్చడి. జీవితంలో ప్రతి మనిషికి సుఖ, దు:ఖాలు ఉంటాయి. వాటికి ప్రతీకగానే ఉగాది పచ్చడి అన్నిరుచుల కలబోతగా ఉంటుంది.
అనగా పులుపు, చేదు, కారం, ఉప్పు, చేదు, ఒగరు... ఈ షడ్రుచుల కలయిక ఈ ఉగాది పచ్చడి. వేపపువ్వు, కొత్త బెల్లం, మామిడి కాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, చెరకు ముక్కలు కలిపి పచ్చడి తయారు చేస్తారు. ఈ పచ్చడిని తినడం వలన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలు పోతాయని ఆయుర్వేదం చెబుతుంది. వసంతరుతువులో వచ్చే చైత్రమాసం వేసవికాలం. ఈ వేసవికాలంలో వేడి పెరుగుతూ ఉంటుంది. సూర్యుని ప్రతాపం పెరగడం వలన వేడికి తాళలేక, ఉష్ణ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయని కూడా అంటుంటారు. ఈ వ్యాధుల నివారణకు వేప ఎంతో ప్రయోజనకారి. అందుకే ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్ధాలలో ఔషదగుణాలు కూడా ఉన్నాయంటారు. మరి ఈ ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్ధాల వలన కలిగే ప్రయోజనాలు, ఔషద గుణాలు ఏమిటో చూద్దామా!
చేదుకు ప్రతీక వేపపువ్వు
ఉగాది పచ్చడిలో చేదుకు గుర్తుగా వేపపువ్వును కలుపుతాం. వేప యాంటిసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న ఏకైక భారతీయ పేటెంట్ గల చెట్టు. సూక్ష్మక్రిములనీ చర్మరోగాలనీ నివారించే శక్తీ వేపకు ఉంది. అంతేకాదు, మశూచి లాంటి ఉష్ణ సంబంధిత రోగం వచ్చినప్పుడు రోగి వద్ద వేప మండలు ఉంచుతారు. కురుపులు తగ్గడానికి వేపాకులను నూరి వాటిపై కట్టుకడతారు. కురుపులు తగ్గాక వేపాకులు వేసి కాచిన నీటితో స్నానం చేయించడం అనవాయితీ. అందుకే ఇలాంటి రోగాలు దరిచేరకుండా ఉండాలంటే వేపపూత తినాలి. వేపపూతను మెత్తగానూరి అందులో ఉప్పు, ఇంగువ, మిరియాలు, జీలకర్ర, వాము కలిపి తింటే సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని ఆయుర్వేదంలో చెప్పారు. వేపపుల్లతో పళ్ళు తోముకుంటే చిగుళ్ళకు బలం చేకూరుతుంది. పళ్ళలో ఉండే సూక్ష్మక్రిములు నశిస్తాయి. పిప్పిపళ్ళకు బాగా పనిచేస్తుంది. కంటి చూపునే పెంచుతుంది. బ్లడ్ షుగర్‌ను తగ్గిస్తుంది. చక్కెరవ్యాధి ఉన్నవారు దీనిని ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. మొటిమలు, చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది. అంటువ్యాధుల నుండి రక్షిస్తుంది. మూత్రపిండాల్ని శుభ్రపరుస్తుంది. మరి ఇన్ని సుగుణాలున్న వేప మంచి ఔషధమే కదూ!
వగరుకు గుర్తు మామిడి
వేసవికాలం తొలినాళ్ళలో లేలేత మామిడికాయలు దొరుకుతాయి. ఇవి వగరుగా ఉంటాయి. అందుకే వగరుకు గుర్తుగా మామిడికాయలను ఉగాది పచ్చడిలో కలుపుకుంటారు. మామిడికాయలలో ఎన్నో ఔషధగుణాలున్నాయి. మామిడి రక్తప్రసరణ దోషాలను నివారిస్తుంది. గుండెకు బలాన్ని ఇస్తుంది. జీర్ణవ్యవస్ధకు, కాలేయానికి శక్తినిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది. శరీరంలో ఉన్న అధికమైన నీటిని తొలగిస్తుంది. రోగనిరోధకంగా పనిచేస్తుంది. అంతేకాదు, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తినే పండు మామిడిపండు. ఈ పండులో వేడిని కల్గించే గుణం ఉండటం వల్ల చలవ శరీరం కలవాళ్ళకు చాలా మంచిది. మామిడిపండు తినడం వల్ల చర్మానికి మెత్తదనం, మెరుపు వస్తాయి.
తీపికి బెల్లం
బంగారు వన్నెలో చూడడానికి అందంగా ఉండే బెల్లం రుచికే కాదు, ఆరోగ్యానికీ మంచిదే. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు బెల్లం తింటే మంచిది. అందుకే ఉగాది పచ్చడిలో తీపికి గుర్తుగా కొత్త బెల్లాన్ని ఉపయోగిస్తారు. కొత్తబెల్లం వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. అందుకే ఎండవేళ బెల్లం పానకం తాగడం ప్రయోజనకారి. బెల్లం ఎసిడిటీని తగ్గించి, జీర్ణశక్తిని పెంచుతుంది. బెల్లంలో ఉండే కాల్షియం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. బెల్లంలో ఉండే ఐరన్ హెమోగ్లోబిన్ పెరగడానికి ఉపయోగపడుతుంది.రక్తంలో చేరిన విషపూరిత పదార్ధాలను తొలగించే శక్తి కూడా బెల్లానికి ఉంది.
పులుపుకు చింతపండు
ఉగాది పచ్చడిలో పులుపుకు కొత్త చింతపండును ఉపయోగిస్తారు. చింత ఆకులు, పువ్వులు, పండ్లు, కాండం... కాదేదీ ఆరోగ్యానికి అనర్హం అనకతప్పదు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న చింతను నిల్వ పచ్చళ్ళకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చింత అమిత దాహాన్ని అరికడుతుంది. చింతచిగురును ఆకుకూరగా కానీ, వేరే ఇతర పదార్ధాలతో కలిపి కానీ వండుకోవచ్చు. చింతకాయలు లేలేతగా ఉన్నప్పటి నుంచే వంటకాలలో వాడుతుంటారు. చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే ప్రతి ఇంటిలో తప్పని సరిగా ఉండే వాటిలో చింతపండు ఒకటి.
కారానికి పచ్చిమిర్చి
మిరపకాయను తలచుకోగానే అది ఇచ్చే కారపు రుచి, ఘాటు గుర్తుకు వస్తాయి. కాని మిరప లేకుండా వంట సాగదు. అందుకే ఉగాది పచ్చడిలో కూడా పచ్చిమిరపకాయలను లేదా ఎండు మిరపకాయల కారాన్ని ఉపయోగిస్తాం. ఇవి శరీరం బరువును తగ్గించడానికి దోహదం చేస్తాయి. పచ్చిమిరపకాయలోని రసాయనిక పదార్ధం కాప్సైసిన్ జీర్ణరసాల్ని క్రియాశీలం చేస్తూ జీర్ణకోశం లోపలి భాగాన్ని కాపాడుతుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. పచ్చిమిరప చెవిపోటు, గొంతువాపు వంటి దుర్లక్షణాలను అరికడుతుంది.
ఉప్పుకు ఉప్పు
ఆధునిక మానవుని జీవనశైలి మారుతోంది. ప్యాకెట్, ప్రాసెస్ చేసిన, రెడీమేడ్‌గా దొరికే పదార్ధాలను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ప్యాక్ చేసి అమ్మే పదార్ధాలలో ఉప్పు ఎక్కువ మోతాదులో ఉంటుంది. ప్రతిరోజు సగటున మనిషికి 6గ్రా ఉప్పు అవసరం. దానికన్నా ఎక్కువ తీసుకోవడం వలన అనారోగ్యానికి గురికాక తప్పదు. కాని ఉగాది పచ్చడిలో రుచుల కలయిక కోసం ఉప్పును వాడుతుంటాం. అది కూడా మోతాదు మించకుండా. ఉప్పు నాడీ ప్రేరేపణకు తోడ్పడుతుంది. సరైన మోతాదులో తీసుకుంటే ద్రవాలు నిల్వ ఉంచడానికి సహకరిస్తుంది. కండరాలు సంకోచించడానికి, ఎదుగుదలకు తోడ్పడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా కూడా చేస్తుంది.
కొత్తకుండలోనే ఉగాది పచ్చడిని చేయడం వల్ల చల్లగా ఉంటుంది. అయితే ఈ పచ్చడి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతిలో చేస్తారు. పైన చెప్పిన వాటితో పాటు కొందరు చెరుకు ముక్కలు, అరటిపండు ముక్కలు.... కూడా వేసుకుంటారు. చెరకు మూత్రపిండాలకు చాలా మంచిది. అధిక మూత్రాన్ని అరికడుతుంది. శరీరంలో వాతాన్ని తగ్గిస్తుంది. కొందరు పచ్చడిని చాలా పలుచగా చేస్తే, కొందరు గట్టిగా చేసుకుంటారు. పలుచగా ఉండే పచ్చడిలో కొందరు పుట్నాలపప్పు కూడా కలుపుతారు. కొంతమంది వేపపువ్వుని నేరుగా వేసేస్తారు. చేదును అంతగా ఇష్టపడని వారు పువ్వుని చేత్తో కొద్దిగా నలిపి, కాడల్ని తీసేసి ఒట్టి పువ్వునే వేసుకుంటారు. అప్పుడు చేదు రాదు. అయితే ఈ పచ్చడి చేసిన వెంటనే తింటే బాగుంటుంది. ఉగాది పచ్చడిని ఏ ప్రాంతంలో, ఎలా చేసుకున్నా దానిలోని షడ్రుచులను ఆస్వాదించాల్సిందే.
సేకరణ: ప్రజాశక్తి






0 comments:
Post a Comment