గర్భవతుల్లో మూత్రపిండాల వాపు ఎందుకొస్తుంది?
గర్భిణుల్లో 4 నెలలు దాటాక, గర్భసంచి పరిమాణం పెద్దదై, మూత్రవాహికపైన ఒత్తిడి పెరుగుతుంది. దాంతో మూత్రం ఆగిపోయి, మూత్రపిండం వాపు కనిపిస్తుంది. కొంత మంది గర్భిణుల్లో మూత్రపిండాల్లో, మూత్రవాహికల్లో రాళ్ల వల్ల కూడా ఈ సమస్య రావొచ్చు.
లక్షణాలు
నడుములో నొప్పి, చలి జ్వరం, వాంతులు అనేవి దీని లక్షణాలు. ఈ లక్షణాలన్నీ వాపుతో పాటు, మూత్రపిండంలో చీము చేరడం వల్ల వస్తాయి. ఒక్కోసారి ఇన్‌ఫెక్షన్ లేనప్పుడు పై లక్షణా లేవీ ఉండకుండా, అల్ట్రా సౌండ్ పరీక్షల్లోనే కిడ్నీ వాపు బయటపడుతుంది.
తల్లికీ, గర్భస్థ శిశువుకీ ఏదైనా ప్రమాదం ఉందా?
కిడ్నీలో వాపు, చీము ఉన్నప్పుడు ఒక్కోసారి అబార్షన్ జరగడం, నెలలు నిండక ముందే ప్రసవం జరగడం వల్ల శిశువుకి ముప్పు ఏర్పడవచ్చు. ఇన్‌ఫెక్షన్ తీవ్రమైతే తల్లికి కూడా సెప్సిస్, షాక్ వచ్చిన ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.
చికిత్స ఏమిటి?
సాధారణంగా గర్భసంచి ఒత్తిడి వల్ల మూత్రపిండం వాపు వచ్చినప్పుడు, తల్లికి నొప్పి, జ్వరం ఏమీ లేనప్పుడు ప్రత్యేకమైన చికిత్స అవసరం లేదు. ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లయితే యాంటీ బయాటిక్స్, నొప్పి నివారణకు మందులు, శిశువుకు హానికలిగించని మందులు వాడాల్సి ఉంటుంది. మందుల ద్వారా ఇన్‌ఫెక్షన్ , నొప్పి, జ్వరం తగ్గకపోతే ఒక్కోసారి కిడ్నీలో డిజెస్టెంట్ వేయాల్సి అవసరం రావచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి కూడా చాలా వరకు మందుల ద్వారానే ఉపశమనం లభించడానికి ప్రయత్నిస్తారు. ఒక్కోసారి నొప్పి తీవ్రంగా వచ్చినప్పుడు, లేదంటే కిడ్నీలో వాపు, చీము ఎక్కువైనప్పుడు, లేదా రెండు మూత్రపిండాలలో రాళ్లు తయారై తల్లి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు గర్భిణుల్లో కూడా మూత్రవాహికలోని రాళ్లను ఎండోస్కోప్ చికిత్స ద్వారా తీయవచ్చు. ఈ చికిత్స తల్లికీ, శిశువుకూ కూడా ఎటువంటి హానీ కలిగించదు.
డాక్టర్ లలిత,
యూరో గైనకాలజిస్ట్
యశోదా హాస్పిటల్, సోమాజీగూడ, హైదరాబాద్.
సేకరణ: ప్రజాశక్తి







0 comments:
Post a Comment