Pages

Subscribe:

Ads 468x60px

Saturday, 13 April 2013

టైఫాయిడ్‌ జ్వరమా?

టైఫాయిడ్‌ జీర్ణకోశానికి వచ్చే ఇన్‌ఫెక్షన్‌. దీని ప్రభావం శరీరమంతటి మీద పడుతుంది. ఇది ఒకరి మలం నుండి మరొకరి నోటికి కలుషితమైన ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. ఒకేసారి చాలా మందికి (ఎపిడమిక్‌) ఈ వ్యాధి వస్తుంది. అన్ని జ్వరాల్లో టైఫాయిడ్‌ ప్రమాదకరం.
లక్షణాలు
మొదటి వారం: జలుబు లేదా ఫ్లూ జ్వరంలా మొదలవుతుంది. తలనొప్పి, గొంతునొప్పి ఉంటాయి. జ్వరం ప్రతీరోజూ కొద్ది కొద్దిగా 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకు పెరుగుతుంది. నాడీ వేగం జ్వరం తీవ్రతతో పోల్చి చూస్తే తక్కువగా ఉంటుంది. ప్రతి అరగంటకు నాడి వేగాన్ని, జ్వరాన్ని చూడాలి. జ్వరం పెరిగేకొద్దీ నాడి వేగం తగ్గుతూ ఉంటే బహుశా అది టైఫాయిడ్‌ జ్వరం అని చెప్పవచ్చు. కొన్నిసార్లు వాంతులు, విరేచనాలు, మలబద్ధకం ఉంటాయి.

రెండో వారం : జ్వరం తీవ్రంగా ఉంటుంది. నాడివేగం తక్కువగా ఉంటుంది. గులాబీరంగు మచ్చలు ఒంటి మీద కనపడవచ్చు. వణుకు ఉంటుంది. రోగి సరిగ్గా ఆలోచించే శక్తిని, అర్థం చేసుకునే శక్తిని కోల్పోతాడు. నీరసంగా ఉంటుంది. బరువు తగ్గుతారు. శరీరం నీటిని కోల్పోయి డీహైడ్రేషన్‌ ఏర్పడుతుంది.

మూడవ వారం: ఇతర ప్రమాదాలేవీ లేకపోతే జ్వరం, ఇతర లక్షణాలు నెమ్మదిగా తగ్గిపోతాయి.

చికిత్స
వెంటనే వైద్యసహాయం పొందాలి. తడిబట్టతో తుడిచి జ్వరాన్ని తగ్గించాలి. ద్రవపదార్థాల్ని ఎక్కువగా ఇవ్వాలి. సూప్స్‌, పళ్లరసాలు, డీహైడ్రేషన్‌ని నిరోధించడానికి 'రీహైడ్రేషన్‌ డ్రింక్‌' అంటే ఓఆర్‌ఎస్‌ ద్రావణం ఇవ్వాలి. జ్వరం పూర్తిగా తగ్గేదాకా రోగి మంచం మీదే ఉండాలి. రోగి మలంలో రక్తం పడినా, న్యుమోనియా లక్షణాలు కనిపడినా వెంటనే వైద్యసహాయం పొందాలి.

నిరోధక చర్యలు
టైఫాయిడ్‌ వ్యాధి వ్యాధిని నిరోధించడానికి తాగేనీరు, ఆహారం మనిషి మలంతో కలుషితం కాకూడదు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. మరుగుదొడ్డిని తాగేనీటికి దూరంగా నిర్మించాలి.

టైఫాయిడ్‌ సామాన్యంగా వరదల తర్వాత ఎక్కువగా వస్తుంది. అటువంటి సమయాల్లో పరిశుభ్రత గురించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. తాగేనీరు స్వచ్ఛంగా ఉండాలి. నీటిని మరగకాచి, చల్లార్చి తాగాలి. ఆహారం, నీరు కలుషితమవడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి.

టైఫాయిడ్‌ వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్తపడాలి. రోగిని వేరుగా ఒక గదిలో ఉంచాలి. అతను ఉపయోగించిన పాత్రలను ఇతరులు వాడకూడదు. అతని మలాన్ని తగలబెట్టాలి. లేకపోతే లోతైన గొయ్యిలో వేసి పూడ్చేయాలి. అతనికి పరిచర్యలు చేసేవారు అతనిని మట్టుకోగానే చేతులు కడుక్కోవాలి.

టైఫాయిడ్‌ జ్వరం తగ్గాక కొంత మంది శరీరంలో ఇంకా రోగక్రిములు ఉంటాయి. ఇంకా ఇతరులకు వాటిని అంటించగలిగి ఉంటారు. అందువల్ల టైఫాయిడ్‌ జ్వరం వచ్చినవారు వ్యక్తిగత శుభ్రత గురించి ఎక్కువ జాగ్రత్త వహించాలి. ఆహారాన్ని ముట్టుకోవాల్సిన పనిచేసేవారు, ముఖ్యంగా హౌటళ్లలో పనిచేసేవారు వ్యాధి తగ్గాక కొంత కాలం వరకు పనిలో చేరరాదు. ఒక్కోసారి వ్యాధిని ఇతరులకు అంటించగల స్థితిలో ఉన్నవారికి (క్యారియర్స్‌) ఏంపిసిలిన్‌ బాగా పనిచేస్తుంది.

టైఫాయిడ్‌ వ్యాధి నిరోధక వ్యాక్సిన్‌ను ప్రతి ఆరు నెలలకు ముఖ్యంగా, వేసవి కాలంలో వేయించుకోవాలి. 

సేకరణ: ప్రజాశక్తి, జీవన

0 comments:

Post a Comment