Pages

Subscribe:

Ads 468x60px

Monday, 16 December 2013

సమస్యల్ని నివారించలేమా

మేధావులు సమస్యల్ని పరిష్కరిస్తారు జ్ఞానులు అసలు సమస్యే రాకుండా నిరోధిస్తారు- ఆల్‌బర్డ్ ఐన్ స్టీన్  'జీవితం అంటే సమస్యల మయం' అంటూ ఉంటారు. ఒక సమస్య పరిష్కారం అయ్యీ కాకముందే మరో సమస్య మొదలవుతుంది కాబట్టి. నిజానికి సమస్యల్ని పరిష్కరించడం అంటే, ముళ్ల చెట్టు కొమ్మల్ని నరికేయడం లాంటిది. నరికేసిన కొమ్మ మళ్లీ చిగురేస్తుంది కదా! కాస్త వెనకో ముందో ఆ చిగురు కూడా మళ్లీ కొమ్మగా మారుతుంది కదా! నరికేశామన్న సంతృప్తే తప్ప కొమ్మల్ని నరికేసిన తాలూకు ప్రయోజన మేదీ ఉండదు. ఎప్పటికైనా ఆ చెట్టును వేళ్లతో సహా పెరికేస్తే తప్ప ఆ ముళ్ల కొమ్మల బాధలు తప్పవు.
అలాగే సమస్యల మూలాల్ని తొలగించకుండా సమస్యల్ని పరిష్కరిస్తూ పోతే ఒరిగే ప్రయోజనమేదీ ఉండదు. ఒక సమస్య స్థానే మరో కొత్త సమస్య పుట్టుకొస్తూనే ఉంటుంది. కానీ, మేధావులంతా సమస్యల్ని పరిష్కరించడమే సమస్తం అన్నట్లు ఉండిపోతారు. వారి ప్రయత్నాల్లో చిత్త శుద్ధి ఉండవచ్చు. వారి కృషి నిరంతరాయమే కావచ్చు. కానీ ఆ శ్రమ చాలా వరకు అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

వేళ్లలోకి వెళితేనే
ఏ కృషి అయినా మొత్తంగా సమస్యల మూలాల్ని తొలగించినప్పుడే కదా సార్థకమయ్యేది? అలా సమస్యే రాకుండా వాటి మూలాల్ని వేళ్లతో సహా పెరికి వేసేది జ్ఞానులు. వీరు సమస్యల కొమ్మల్ని నరికే ప్రయత్నం చేయరు. వారి దృష్టి అంతా వేళ్లను పెకిలించి వేయడం మీదే ఉంటుంది. నిజానికి వేళ్లను పెకిలించి వేశాక కొమ్మల్ని నరకాల్సిన అవసరమే రాదు. కొమ్మలన్నీ వాటంతట అవే విరిగి ఒరిగిపోతాయి. విపరీతంగా వరదలు వస్తున్నప్పుడు ఆ ధాటికి తట్టుకోలేక చెరువు కట్ట ఎక్కడ తెగిపోతుందోనని అందరూ ఆ కట్టమీదే దృష్టి పెడతారు. ఎక్కడెక్కడ తెగిపోయే అవకాశం ఉందో ఆయా భాగాల్లో ఇసుక బస్తాలు నింపడానికి ప్రయత్నిస్తారు. కానీ, చెరువు కట్ట ప్రమాద స్థితికి చేరడానికి కారణమైన ఆ వరదల్ని మరో వైపు మలిచే ప్రయత్నం చేయరు. ఇదంతా మేధావుల వృధా ప్రయాస. ఇలా ఎంత ఎంత ప్రయాస పడినా ఏదో ఒక సమయాన ఆ కట్ట తెగిపోకుండా ఉండదు. ఇదే సమస్య జ్ఞానుల ముందుకు వ స్తే వాళ్ల చర్యలు వేరుగా ఉంటాయి. వారు ఆ వచ్చిపడే వరదల్నే దారి తప్పిస్తారు. చెరువు కట్ట ఆ వరద దాటికి అసలు గురి కాకుండానే చేస్తారు.

ఆ వైపు ఎందుకు వెళ్లరు?
చాలా మంది సమస్యల వేళ్లను పెకిలించే ప్రయత్నాలు చేయకపోవడానికి కారణాలు అనేకం. వాటిలో సమస్యల వేళ్లను పసిగట్టలేకపోవడం ఒక కారణమైతే, పసిగట్టినా, వాటిని పరిష్కరించడం అంత సులభమైన పని కాదనుకోవడం ఒక కారణం. అందుకే తాత్కాలిక ప్రయోజనమే అయినా ఆ దిశగా పని చేయడమే ఉత్తమమనుకుంటారు. కానీ, ఒకటికి పదిసార్లు కొమ్మలు నరుక్కుంటూ ఉండిపోవడం కన్నా, ఒకేసారి వేళ్లను నరికేస్తే సమస్య తీరిపోతుంది కదా! అన్న దిశగా వారు ఆలోచించరు. దీర్ఘకాలిక ప్రణాళికలు కాకుండా, స్వల్పకాలిక ప్రయోజనం ఆశించడం కూడా అందుకు కారణమే. మరికొందరు అసలు ఆ సమస్య తలెత్తడానికి గల కారణమేమిటో కనీసమైనా పరిశీలించకుండానే ఏకంగా వాటి పరిష్కరించడానికే దిగిపోతారు. అంతకు ముందు అలాంటి సమస్యలెన్నో చూశాం కదా అనే ధీమాయే అందుకు కారణం. కానీ, చాలా సమస్యలు బాహ్యంగా ఒకేలా కనపడినా , వాటి లోతుల్లో ఎంతో భిన్నత్వం ఉంటుంది. అందుకే ఇతర సందర్భాల్లో చేసిన ప్రయత్నాలే ఇక్కడా చేయబోయి చాలా మంది విఫలమవుతారు. నిజానికి కారణాల్ని సరిగా కనిపెడితే దాని వేళ్లలోకి వెళ్లడం కూడా సులువే అవుతుంది. కారణాల్లోకి వెళ్లే ఆ ప్రయత్నమే చేయకపోవడం వల్ల వేళ్ల ఉనికి వాళ్లకు తెలిసి రాదు. అందుకే కొమ్మలు నరికే పనిలో పడతారు. " సమస్యను సరిగ్గా అర్థం చేసుకుంటే దాని పరిష్కారం అక్కడే దొరికిపోతుంది. ఎందుకంటే పరిష్కారం సమస్యకు భిన్నమైనది కాకపోవడమే'' అంటాడు జిడ్డు కృష్ణమూర్తి. జీవితమంతా ఆ కొమ్మలు నరుకుతూ ఉండిపోవడం వల్ల ప్రయోజనం లేదు. ఏదో ఒక దశలో మేధావులు, జ్ఞానులుగా మారాలి. కొమ్మలు నరికే పనిలో కాకుండా వేళ్లను పెకిలించే పనిలో పడాలి. ఈ క్రమంలోనే సమస్యల్ని పరిష్కరించే మేధావులుగానే మిగిలిపోకుండా, అసలు సమస్యలే రాకుండా చేసే జ్ఞానులుగా ఎదగాలంటారు ఐన్‌స్టీన్.

సేకరణ: ఆంధ్రజ్యోతి

0 comments:

Post a Comment