ఆహారం తీసుకోవడానికి, నీళ్లు తాగడానికి, మాట్లాడటానికి... ఇలా అనేక సందర్భాల్లో నోరును తెరుస్తుంటాం. దీంతో నోటిలోకి తగిన స్థాయిలో ఆక్సిజన్ ప్రవేశిస్తుంది. అయితే రాత్రివేళల్లో నిద్ర కారణంగా ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి నోరు చాలాసేపు మూసుకుపోయి ఉంటుంది. దీంతో తగినంత ఆకి ్సజన్ అందక నోటిలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా ఉదయం నిద్రలేవగానే నోటి నుంచి దుర్వాసన వస్తుంది.
దంతాలను శుభ్రంగా బ్రష్ చేసుకుని, నీటితో బాగా పుక్కిలించి కడుకున్నప్పుడు వాసన తగ్గిపోతుంది. అయితే ఈ సమస్య కొందరిలో దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది.
కారణాలు:
నోటిదుర్వాసనకు కారణాలలో దాదాపు 90 శాతం నోటికి సంబంధించినవే ఉంటాయి. ఉదాహరణకు ఉల్లి, వెల్లుల్లి, మాంసం, చేపలు తినడం, మద్యం, పొగతాగడం, స్థూలకాయం వంటివి నోటిదుర్వాసనకు కారణమవుతాయి. అంతేకాకుండా నోరు మొదలుకుని ఆహారనాళం వరకు అనేక సమస్యలు నోటి దుర్వాసనకు కారణమవుతాయి.
నోరు:
నోట్లో సుమారు ఆరువందల రకాలకు పైగా బ్యాక్టీరియాలుంటాయి. ఈ బ్యాక్టీరియాలో అనేక రకాల నోటి దుర్వాసనకు కారణమవుతుంటాయి. ముఖ్యంగా చిగుళ్ల సమస్యలు, దంతాలు విరిగిపోయి ఉండటం, దంతాల మధ్య సందులు, కట్టుడు దంతాలు వంటివి కూడా దుర్వాసనకు కారణమవుతుంటాయి.
నాలుక:
నోటి దుర్వాసనకు కారణాలలో అతి ముఖ్యమైనది నాలుక శుభ్రం చేసుకోకపోవడం. నాలుకపై ఉండే బ్యాక్టీరియా దుర్వాసనను, కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. నాలుకను శుభ్రం చేసుకుంటే దుర్వాసనను చాలా మట్టుకు నివారించవచ్చు. దీనికోసం మౌత్‌వాష్ ఉపయోగించడం వంటివి చేయాలి.
చిగుళ్ల వ్యాధులు:
చిగుళ్ల వ్యాధులు తీవ్రమైన నోటి దుర్వాసనకు కారణమవుతాయి. చిగుళ్లు వ్యాధిగ్రస్తం కావడం, నోటిలో పుండ్లు
రావడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది.
దంతాలు:
దంతాలు విరిగిపోయి ఉన్నా, పళ్ల మధ్య ఖాళీలు ఉన్నా మనం తీసుకునే ఆహారం అక్కడ చిక్కుకుపోతుంది. దాన్ని సక్రమంగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అందులో బ్యాక్టీరియా చేరడానికి ఆస్కారం ఉంటుంది. ఫలితంగా చిగుళ్ల వ్యాధులు సోకడమే కాకుండా, దంతమూలం వరకు దంతాలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతో దంతక్షయం, పంటినొప్పి వంటి సమస్యలు బాధిస్తాయి. వాటితోపాటు నోటి దుర్వాసన సమస్య కూడా వస్తుంది.
కృత్రిమ దంతాలు:
కృత్రిమ దంతాలు అమర్చుకున్న వారిలో నోటి దుర్వాసన తరచూ కనిపించే సమస్య. ముఖ్యంగా తీసిపెట్టుకునే కృత్రిమ దంతాలు అమర్చుకున్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల వాటిని రాత్రివేళ తీసి, వైద్యులు సూచించిన విధంగా భద్రపరచుకోవడం, వాటిని ఉపయోగించే ముందు, తరువాత శుభ్రం చేసుకోవడం చాలా అవసరం.
ఇతర సమస్యలు:
శరీరంలో ఇతర అవయవాలకు సోకే ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా నోటి దుర్వాసన రావచ్చు. సైనస్ ఇన్‌ఫెక్షన్, టాన్సిల్స్, జీర్ణ సంబంధిత వ్యాధులు మొదలైన వాటి వల్ల కూడా నోటి దుర్వాసన రావచ్చు.
నివారణ, చికిత్స:
ప్రతిరోజు ఉదయం, రాత్రి రెండుపూటలా దంతాలు శుభ్రం చేసుకోవాలి. బ్రష్ చేసుకున్న తరువాత టంగ్‌క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోవాలి. చిగుళ్ల నుంచి రక్తం కారడం, పిప్పి పళ్లులాంటివి ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా దంతవైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. సైనస్, టాన్సిల్స్, జీర్ణసంబంధిత వ్యాధులు ఉంటే చికిత్స తీసుకోవాలి. దంతాలపై పాచి పేరుకుని గారలా మారితే అది బ్రషింగ్‌తో పోదు. ఈ సమస్యకు స్కేలింగ్ చికిత్స అవసరమవుతుంది. పిప్పి పళ్లను అలాగే వదిలేయకుండా ఫిల్లింగ్ కానీ, ఎక్కువగా ఉంటే రూట్‌కెనాల్ చికిత్స కానీ చేయించుకోవాలి. నోటి దుర్వాసన ఉన్నప్పుడు బాధపడుతూ కూర్చోకుండా దంతవైద్యులను సంప్రదించడం ద్వారా సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.
డాక్టర్ శ్రీనివాస్, ఎండీఎస్
స్టార్ డెంటల్సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి
ఫోన్ : 7416 105 105, 90300 854 56
సేకరణ : ఆంధ్రజ్యోతి, సకల








0 comments:
Post a Comment