నీరు సకల జీవరాసులకు ప్రాణాధారం. నీరు లేనిదే మనుగడే లేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ‘నీటిని ఆరోగ్యం కోసం తప్పకుండా తాగాలని ఒకరు చెప్పడం ఏమిటి? నీరు తాగడం మనం రోజూ చేసేదే కదా!’ అని అడిగే అవకాశం ఉంది. నీరు ఎప్పుడెప్పుడు, ఎంతెంత తాగితే, ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు సమకూరతాయన్న విషయాలు తెలుసుకోవాలి. అనేక పరిశీలనలు, అధ్యయాల ద్వారా తెలిసిన అంశాలను క్రోడీకరించి ఇస్తున్న వివరాలివి...
పని చేసి అలసిపోయాక...
ఇంట్లో ఏదైనా బరువైన పని చేసి అలసిపోయారా? ఆగండి. కాస్తంత (కనీసం ఓ ఐదు నిమిషాల) వ్యవధి ఇవ్వండి. పని పూర్తయిన వెంటనే దాహంగా ఉన్నా మంచినీళ్లు తాగకండి. అలాగని దాహంగా లేకపోయినా మంచినీళ్లు తాగకుండా ఉండకండి. బట్టలు ఉతకడం, ఇల్లు తుడవడం వంటి బరువు పనులు పూర్తయ్యాక ఐదు నిమిషాల తర్వాత దాహంగా ఉన్నా లేకపోయినా రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. దానితో అలసిపోయిన ప్రతి కణానికి పునరుత్తేజం వస్తుంది. అలసట తీరుతుంది.
స్నానానికి ముందు...
వేళకు స్నానం చేసేవారు నీళ్లతో మరో ప్రయోగం చేయవచ్చు. స్నానం చేయడానికి సరిగ్గా ఇరవై నిమిషాల ముందు గ్లాసుడు నీళ్లు తాగండి. ఇలా తాగే నీళ్లు హైబీపీ ఉన్నవారిలో రక్తపోటును తగ్గించి నియంత్రిస్తాయి. ఈలోపు చెమటగా వచ్చిన నీరు ఆరిపోవటం వల్ల మరింత పరిశుభ్రమైన శరీర అనుభూతి మీ సొంతమవుతుంది.
చాలామంది భోజనానికి ముందు నీళ్లు తాగరు. భోజనం పూర్తిగా పట్టదు, ఆకలి చచ్చిపోతుందని. అది పాక్షికంగా నిజమేగాని... భోజనానికి సరిగ్గా అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే తిన్న అన్నం పూర్తిగా, సరిగా జీర్ణమవుతుంది. సరిగ్గా వేళకు భోజనం చేసేవారికి ఈ ఆరోగ్య సూత్రం బాగా వర్తిస్తుంది.
రాత్రి నిద్రపోయే ముందు...
తమకు గుండెపోటు వస్తుందేమో అన్న ఆందోళన కొందరిలో ఉంటుంది. కొద్దిమందిలో ఇది మరింత ఎక్కువ. నిద్రకు ఉపక్రమించే అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే గుండెపోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయట.
ప్రతిరోజూ...
రోజుకు కనీసం పన్నెండు గ్లాసులకు (రెండున్నర లీటర్లకు) తక్కువ కాకుండా నీళ్లు తాగాలి. దీనివల్ల శరీరంలోని నీరు, లవణాల పాళ్లు సరిగ్గా ఉంటాయి. సాధారణ ఆరోగ్యం కోసం ఇలా నీళ్లు తాగడమన్నది తప్పకుండా చేయాలన్నది మనం వినే మాటే అయినా ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసుకోవడం అన్నది ఆరోగ్యానికి మరింత మంచి చేసే విషయమే.
(కనీసం పన్నెండు గ్లాసులు అన్నది సాధారణ రోజుల్లోని మాట. వేసవిలో రోజూ ఐదు లీటర్ల వరకు తాగాలని గుర్తుంచుకోండి. అంటే ఉజ్జాయింపుగా చెప్పాలంటే మామూలు రోజుల కంటే రెట్టింపు అన్నమాట).








0 comments:
Post a Comment